చిన్నప్పటినుంచీ మీ బుజ్జి చేతులు పైకెత్తి 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ నన్ను ఎంతో అల్లరిగా పిలిచేవారు కదూ! అలా పిలిచింది మీరు మాత్రమే కాదు సుమా! మీ అమ్మానాన్నలు, మీ తాతయ్యలు, నాయనమ్మలు, వాళ్ల తాతముత్తాతలు కూడా నాకంటే ఎంతో పెద్దవాళ్లయినా సరే నన్ను 'మామా' అనే ముద్దుగా పిలిచేవాళ్లు. వాళ్ళ పిలుపు విని నేను పైనుంచి చిరునవ్వులు చిందించేవాణ్ణి.
ఆ వెన్నెల నవ్వులు చూసి మురిసిపోయి, నన్ను కిందకు తీసుకురమ్మని మీ అమ్మతో ఎంతో గొడవ చేసేవారు. మీకు తెలుసా? సాక్షాత్తూ ఆ బాల రాముడు కూడా చిన్నప్పుడు నన్ను కావాలని ఇలాగే మారం చేశాడట. అప్పుడు కౌసల్యా మాత ఏం చేసిందో తెలుసా? ఒక అద్దం తెచ్చి అందులో నన్ను చూపించింది. ఆ అద్దంలో నా నీడను చూసి నిజంగానే చందమామ కిందకు వచ్చేశాడని ఏడుపు ఆపేశాడట ఆ చిన్ని రాముడు. ఎంత అమాయకుడో కదా!
మీ తాతముత్తాతల కాలంలో నేను కిందకు రాలేకపోయాను కానీ, ఇప్పుడు మాత్రం మీకోసమే ప్రత్యేకంగా వస్తున్నాను. మీకూ, మీ అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కనిపిస్తాను. భూమ్మీద, ఆకాశంలో నేను రోజూ చూసే ఎన్నో వింతలను, నా దగ్గరున్న బోలెడన్ని కథలను, చక్కటి పాటలను, పద్యాలను, ఎన్నో గమ్మత్తులను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను.
ఇదుగో, ఈ నెలకు కొన్ని ముచ్చట్లు తీసుకొచ్చాను. చదువుకోండి. ఇవి చాలదంటే నాకు చెప్పండి, వచ్చే నెల మరిన్ని కొత్త కథలతో మళ్లీ మీ ముందుకు వస్తాను!
మరిన్ని అద్భుతమైన పాత కథల కోసం DigiBadi.in ని ప్రతిరోజూ సందర్శించండి. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన Sateesh Vemula ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి.

0 Comments