Live Gold & Silver Rates

ఒక తల్లి త్యాగం, ఓ జాతి పోరాటం: 'పారడైస్' Paradise (2026) సినిమా పూర్తి కథా వివరణ

 


⚠️ SPOILER ALERT! ⚠️
ఈ పోస్ట్‌లో 'పారడైస్' సినిమా పూర్తి స్టోరీ, ట్విస్టులతో సహా రివ్యూ చేయబడింది.
👉 సినిమా ఇంకా చూడని వాళ్లు, సినిమా థ్రిల్ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్లు దయచేసి ఈ పోస్ట్‌ని ఇగ్నోర్ చేయండి. చూసిన వాళ్లు మాత్రం కథ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి!

పారడైస్ (Paradise) - పూర్తి కథా వివరణ:

బానిసత్వం, నరకం లాంటి పారడైస్:
1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే, ఒక చిన్న ప్రాంతంలో మాత్రం కొంతమంది ప్రజలు ఇంకా నరకంలోనే బతుకుతుంటారు. ఆ ప్రాంతం పేరే 'పారడైస్'. పేరుకి పారడైస్ కానీ అది ఒక నరకం. అక్కడ ఉండే ప్రత్యేక కమ్యూనిటీ ప్రజలకు కనీస హక్కులు ఉండవు. వారి నుదుటి మీద ఒక ముద్ర వేసి సమాజం నుంచి దూరం చేస్తారు. కనీసం జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లే హక్కు కూడా వాళ్లకు ఉండదు. వీళ్లందరినీ బానిసల్లా శాసించే వ్యక్తి పేరు 'మాలిక్' (మోహన్ బాబు). మాలిక్ అంటే ఆ జనాలకు భయం, వాళ్ళ జీవితాలు అతని గుప్పిట్లోనే ఉంటాయి.

సమ్మక్క పోరాటం, జడల్ జననం:
ఇదే పారడైస్‌లో సమ్మక్క అనే నిండు గర్భిణీ ఉంటుంది. ఆమె భర్త ముందే చనిపోతాడు. అయినా సరే తన జాతికి హక్కులు కావాలని ఆమె ఊరి జనాన్ని తీసుకుని తహసీల్దార్ ఆఫీస్‌కు వెళుతుంది. కానీ అధికారులు మాలిక్‌కు భయపడి వాళ్లను గెంటేస్తారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెను కిందకు నెట్టేస్తారు. ఏమీ చేయలేక వారంతా పారడైస్‌కు తిరిగి వస్తారు. అక్కడే సమ్మక్కకు పురిటి నొప్పులు వస్తాయి. వాళ్లకు ఆసుపత్రికి వెళ్లే అర్హత లేకపోవడంతో దేవత ముందు ఏడుస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన మాలిక్, వాళ్ళ మీద కోపంతో సమ్మక్క పొట్ట మీద ఎలక్ట్రిక్ వైర్ పెట్టి కరెంట్ షాక్ ఇస్తాడు. ఆ టార్చర్‌లోనే ఆమెకు ఇద్దరు కవలలు పుడతారు. ఒకరు చనిపోగా, మరొకరు బతుకుతాడు. సరిగ్గా అదే సమయానికి మాలిక్‌కు కూడా ఒక కొడుకు (విక్రమ్) పుడతాడు. సమ్మక్క కొడుకుని ఆ జాతి ప్రజలంతా తమను మార్చే నాయకుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు. అతనే మన హీరో 'జడల్'. సమ్మక్క అతన్ని జుట్టు కత్తిరించకుండా రెండు జడలు వేసి ధైర్యంగా పెంచుతుంది.

చేతిపై పచ్చబొట్టు (అవమానం):
కొన్ని సంవత్సరాల తర్వాత, చిన్న మాలిక్ విక్రమ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. పారడైస్ జనాలకు మాలిక్ భోజనం పెడుతుంటాడు. అప్పుడు చిన్న పిల్లాడైన జడల్, తన స్నేహితుడు బిర్యానీ కోసం ఎవరికీ తెలియకుండా రెండు చికెన్ ముక్కలు తీసుకుంటాడు. అది చూసిన విక్రమ్ జడల్‌ను దారుణంగా కొట్టి చంపబోతాడు. మాలిక్ వచ్చి అతన్ని ఆపి, చికెన్ కోసం ఆశపడకుండా ఉండాలని జడల్ చేతి మీద వాళ్ళ అమ్మ (సమ్మక్క) గురించి దారుణమైన బూతు పచ్చబొట్టు పొడిపిస్తాడు. తన తల్లి గురించి తప్పుగా రాయడం తట్టుకోలేక జడల్ అక్కడినుండి పారిపోతాడు.

మొదటి హత్య, జైలు శిక్ష:
పారిపోతున్న జడల్‌కు దారిలో ఒక చిన్న కుక్క కనిపిస్తుంది. దాని మెడకు విక్రమ్ టపాసులు కట్టి ఉంటాడు. జడల్ ఆ కుక్కను రక్షిస్తాడు. కానీ విక్రమ్ మనుషులు ఆ కుక్కను చెత్త బండిలో వేసి టపాసులు పేలుస్తారు. అయినా సరే జడల్ ప్రాణాలకు తెగించి ఆ కుక్కను కాపాడతాడు. విక్రమ్ మనిషి అందులో చూడటానికి వెళ్లినప్పుడు, జడల్ తుపాకీతో అతన్ని కాల్చి చంపుతాడు. తన తల్లిని అవమానించారనే కోపం, తనను చంపడానికి వచ్చిన వాళ్ల మీద పగతో జడల్ తన జీవితంలో మొదటి హత్య చేస్తాడు. పోలీసులు జడల్‌ను జైలుకు పంపుతారు.

14 ఏళ్ల తర్వాత తిరుగుబాటు:
14 ఏళ్ళు గడిచినా పారడైస్ జనాల బతుకులు మారవు. జైల్లో ఉన్న జడల్, ఒక గురువు దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని సరైన ఫైటర్‌గా మారతాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయానికి తనను చంపడానికి వచ్చిన రౌడీలను చితకబాది, వాళ్ల రక్తంతో తన నుదుటి మీద కమ్యూనిటీ గుర్తును మళ్ళీ వేసుకుంటాడు. పారడైస్ తిరిగి వచ్చిన జడల్, వాళ్ళ బతుకులు మారలేదని తెలుసుకుని తన స్నేహితుడు బిర్యానీతో కలిసి ఒక టీమ్ సెట్ చేసుకొని మాలిక్ లారీలను హైజాక్ చేయడం మొదలుపెడతాడు. తన చిన్ననాటి స్నేహితుడు బిర్యానీకి ఫుల్ మీల్స్ పెట్టిస్తాడు. ఊరి జనం అందరికీ కడుపునిండా బిర్యానీ పెడతాడు. కానీ జైలుకు వెళ్ళడానికి, తన చేతి మీద బూతు పచ్చబొట్టుకు కారణం తన తల్లే అని ఆమెను పూర్తిగా దూరం పెడతాడు.

హీరోయిన్ సుబ్బుతో పరిచయం:
ఈ సమయంలో హీరోయిన్ సుబ్బు ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ అవ్వాలని మద్రాస్ వెళ్లి మోసపోయి, అప్పుల పాలై చివరకు అప్పు తీర్చడానికి తన తల్లితో కలిసి అడల్ట్ ఫిల్మ్ తీస్తుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సుబ్బును జడల్ మోటివేట్ చేసి కాపాడతాడు. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరోజు మాలిక్ మనుషులు సమ్మక్క గురించి అసభ్యంగా మాట్లాడితే జడల్ వాళ్ళని చితక్కొడతాడు. ఆ తర్వాత సుబ్బు అడల్ట్ సినిమా గురించి జడల్‌కు తెలియడంతో, ఆమె కూడా మోసం చేసిందనే కోపంతో ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు.

రాజకీయాలు, అసలు నిజం తెలియడం:
చిన్న మాలిక్ విక్రమ్ ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లోకి వస్తాడు. వాడికి పవర్ వస్తే పారడైస్ ప్రజలకు ఇంకెప్పటికీ స్వేచ్ఛ రాదని జడల్, విక్రమ్‌ను కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఒకసారి ఊరిలో ఒక పిల్లాడికి కాలిపోతే, డాక్టర్లు ఆ కమ్యూనిటీ ముద్ర చూసి ట్రీట్మెంట్ చేయరు. కలెక్టర్ వచ్చి సహాయం చేస్తానన్నా, జడల్ "మా స్వేచ్ఛను మేమే లాక్కోవాలి" అని చెప్తాడు. విక్రమ్ కలెక్టర్‌ను చంపేసి, ఊరి వాళ్ళ మీద దాడి చేయిస్తాడు. జడల్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉన్నప్పుడు జడల్‌కు తన తల్లి గురించిన అసలు నిజం తెలుస్తుంది. చిన్నప్పుడు జడల్‌కు జబ్బు చేస్తే కమ్యూనిటీ ముద్ర వల్ల డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకోరు. అప్పుడు కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సమ్మక్క తన శరీరాన్ని త్యాగం చేస్తుంది (వ్యభిచారం చేస్తుంది). ఆ త్యాగాన్ని సమాజం బూతు పచ్చబొట్టుగా మార్చిందని జడల్‌కు తెలిసి కుమిలిపోతాడు.

విక్రమ్, మాలిక్ లతో యుద్ధం:
సమ్మక్కను చంపడానికి విక్రమ్ పారడైస్ మీద దాడి చేస్తుంటే, జడల్ ఎంట్రీ ఇచ్చి విక్రమ్‌ను చంపేస్తాడు. వాడి డెడ్ బాడీని మాలిక్ దగ్గరకు పంపుతాడు. కోపంతో రగిలిపోయిన మాలిక్ తన పవర్ ఉపయోగించి జడల్‌ను కొట్టి పారడైస్ ఎంట్రెన్స్ దగ్గర ఉరి తీసినట్లు వేలాడదీస్తాడు. సమ్మక్కను గుహలో బంధిస్తాడు. జనాలకి ప్రభుత్వ హక్కులు రాకుండా వాళ్ళ చేతి వేళ్లను చితక్కొట్టిస్తాడు మాలిక్. సుబ్బు వచ్చి ప్రాణాపాయంలో ఉన్న జడల్‌ను కాపాడి, అతని గురువు దగ్గరకు తీసుకెళ్తుంది. రికవర్ అయిన జడల్, మాలిక్ మనుషులను చంపి తన తల్లిని బయటకు తీసుకొస్తాడు.

స్వేచ్ఛ కోసం పోరాటం - ముగింపు:
జడల్ పారడైస్‌ను ఒక స్వతంత్ర ప్రాంతంగా మారుస్తాడు. కాకీ సింబల్ ఉన్న జెండాను, 'ఆయా షేర్' అనే జాతీయ గీతాన్ని పెట్టుకుంటారు. లీగల్ రైట్స్ కోసం ఎమ్మెల్యే కేసీఆర్‌ను కలిస్తే, ఆయుధాలు వదిలేస్తే లీగల్ రైట్స్ ఇప్పిస్తానని చెప్తాడు. జనాల కోసం ఆయుధాలు వదిలేస్తారు. ఇదే అదునుగా మాలిక్, ఒక లాయర్ మరియు సైకో పోలీస్ ఆఫీసర్‌తో కలిసి వాళ్ళ మీద ఉగ్రవాదులు అనే ముద్ర వేసి జైల్లో పెట్టాలని ప్లాన్ చేస్తాడు. గర్భిణీ స్త్రీ ఒకరు తన బిడ్డకు బానిస బతుకు రాకూడదని తన ప్రాణాలు వదిలి బిడ్డను జడల్ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత ఆయుధాలు లేకపోయినా పారడైస్ జనం పోలీసుల మీద ఉప్పెనలా తిరగబడతారు.

ఆ ఫైట్‌లో సమ్మక్కకు బుల్లెట్ తగులుతుంది. అదే సమయానికి ఎన్టీఆర్ గారు అక్కడికి వచ్చి వాళ్లకు సిటిజెన్‌షిప్ ఫార్మ్స్ ఇస్తారు. చేతి వేళ్లు లేకపోయినా సమ్మక్క తన కాలి బొటనవేలితో ఫార్మ్ మీద ముద్ర వేసి, కొడుకు ఒడిలో ప్రశాంతంగా ప్రాణాలు వదులుతుంది. తన పవర్ అంతా నాశనమైపోవడంతో తట్టుకోలేక మాలిక్ ఆత్మహత్య చేసుకుంటాడు. జడల్ తన తల్లి చేసిన త్యాగాలను తలుచుకుంటూ ఆమె పాదాలు పట్టుకుని ఏడవడంతో, ఎంతో ఎమోషనల్ నోట్‌తో ఈ పారడైస్ సినిమా ముగుస్తుంది.

Post a Comment

0 Comments